Home  »  Bollywood News  »  కరణ్ జోహ‌ర్‌కు షాక్ ఇచ్చిన  స్టార్ డైరెక్టర్.. చిక్కుల్లో కొత్త ప్రాజెక్ట్‌!

Updated : Jun 7, 2026

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్న క్రేజీ సీక్వెల్ ‘దోస్తానా 2’ చుట్టూ ఉన్న గ్రహణం వీడటం లేదు. ఎన్నో ఆశలతో పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్న ఈ సినిమాకు ఇప్పుడు మరో గట్టి ఝలక్ తగిలింది. ఈ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేయాల్సిన స్టార్ డైరెక్టర్ అకస్మాత్తుగా సినిమా నుండి తప్పుకున్నట్లు బి-టౌన్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.  గత కొన్ని నెలలుగా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్, ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు అద్వైత్ చందన్ తాజాగా ఈ ప్రాజెక్ట్ నుండి అర్ధాంతరంగా వైదొలిగారనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు ఏడు నెలల పాటు ఈ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్‌పై వర్క్ చేసిన ఆయన, ఇప్పుడు ఈ సినిమాకు గుడ్ బై చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.  

నిర్మాత కరణ్ జోహార్‌కు, డైరెక్టర్ అద్వైత్ చందన్‌కు మధ్య కొన్ని కీలకమైన కథాంశాల విషయంలో తీవ్రమైన అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు సమాచారం. ‘క్రియేటివ్ డిఫరెన్సెస్’ వల్లే ఇద్దరి ఆలోచనలు కలవలేదని, దీంతో ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే విడిపోయారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అయితే వీరి మధ్య ఎలాంటి గొడవలు జరగలేదని, కేవలం సినిమా మేకింగ్ శైలి నచ్చకే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.  గతంలో అమీర్ ఖాన్‌తో ‘సీక్రెట్ సూపర్ స్టార్’, ‘లాల్ సింగ్ చడ్డా’ వంటి ఎమోషనల్ చిత్రాలను తెరకెక్కించిన అద్వైత్ చందన్ ఈ రొమాంటిక్ కామెడీ సీక్వెల్‌ను సరికొత్తగా ప్రెజెంట్ చేయాలని భావించారు. 

ఈ కొత్త వెర్షన్‌లో విలక్షణ నటుడు విక్రాంత్ మాస్సే, యువ హీరో లక్ష్య ప్రధాన పాత్రలుగా ఎంపికయ్యారు. అలాగే మాజీ మిస్ ఇండియా సినీ శెట్టి ఈ సినిమాతోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందని టాక్ నడిచింది.  నిజానికి ‘దోస్తానా 2’ ప్రాజెక్ట్‌కు ఇలాంటి సమస్యలు రావడం ఇదే మొదటిసారి కాదు. 2019లోనే కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్ లీడ్ రోల్స్‌లో ఈ సినిమా అనౌన్స్ అయింది. గోవాలో కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకుంది. కానీ ఆ తర్వాత కార్తీక్ ఆర్యన్‌తో కరణ్ జోహార్‌కు వచ్చిన మనస్పర్థల వల్ల ఆ వెర్షన్ పూర్తిగా ఆగిపోయింది. ఆ తర్వాత కోలిన్ డికూన్హా కూడా డైరెక్టర్‌గా తప్పుకోగా, అద్వైత్‌ను రంగంలోకి దించారు.  

వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలు చూసి బాలీవుడ్ అభిమానులు, నెటిజన్లు ‘ఈ సినిమాకు ఏదో దిష్టి తగిలింది’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్తాలతో వచ్చిన ఒరిజినల్ ‘దోస్తానా’ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. కానీ ఈ సీక్వెల్ మాత్రం మొదలవ్వడానికే ఇన్ని తిప్పలు పడటం గమనార్హం.ప్రస్తుతానికి దర్శకుడు లేకపోవడంతో ‘దోస్తానా 2’ భవిష్యత్తు మళ్లీ సందిగ్ధంలో పడింది. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ ఇప్పుడు సరికొత్త దర్శకుడి వేటలో పడినట్లు ఇండస్ట్రీ టాక్. మరి ఈ క్రేజీ సీక్వెల్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఎవరికి దక్కుతుందో, అసలు ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.